studio9focus

నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్‌

Politics

జనగామ: దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పారు. కానీ భాజపా నేతలు మాత్రం పింఛనులో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారంచేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానని సవాల్‌ విసిరారు. శనివారం జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. భాజపా నేతలకు ఓట్లు మాత్రమే కావాలి తప్ప ప్రజలు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామన్నారు. రైతులను కాపాడుకొనేందుకు పిడికిలి బిగించాలని, యుద్ధానికి కదలాలన్నారు. మక్కలు సాగుచేస్తే మద్దతు ధర రాకుండా రైతులు మునిగిపోతారన్నారు. నష్టపోయినా సరే ఈసారి మక్కలు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *