కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ సీరియస్.. రేపు కీలక భేటీ

Politics

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలతో పాటు అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వినిపించాల్సి వాదనలపై సీఎం జగన్ అధికారులతో చర్చలు జరపనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. మంత్రి అనిల్ కుమార్, అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సరికావని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి వద్దన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ ప్రాజెక్టు అనడాన్ని ఆయన ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించి ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటోందని.. అలాంటప్పుడు తమ రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించుకుంటే తప్పేంటని ఆయన అన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేంద్రమే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *