సౌతాంప్టన్: విశ్వ విజేత ఇంగ్లాండ్ జట్టుకు పసికూన ఐర్లాండ్ టీమ్ భారీ షాక్ ఇచ్చింది. వరుసగా రెండు వన్డేలు గెలిచి మంచి జోరుమీదున్న ఇంగ్లాండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మూడో వన్డేలో ఇంగ్లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(142: 128 బంతుల్లో 9ఫోర్లు, 6సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ(113: 112 బంతుల్లో 12ఫోర్లు) శతకాలతో చెలరేగడంతో 329 పరుగుల లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో ఛేదించడంతో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్టిర్లింగ్ అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును డేవిడ్ విల్లే దక్కించుకున్నాడు.
అంతకుముందు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం లభించలేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది.