తెలంగాణలో మందుబాబులు పండుగ చేసుకునే వార్త ఇది. లాక్ డౌన్ నిబంధనలతో మందుకోసం ఎక్కువసేపు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్డౌన్ నేపధ్యంలో మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని.. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు.గతంలో లాక్ డౌన్ సమయంలో మందుషాపులు తెరవాలంటూ మద్యం ప్రియులు ప్రభుత్వానికి వినతులు చేశారు. చివరికి సీఎం కేసీయార్ మందుబాబుల కోసం నిబంధనలతో మద్యం షాపులు తెరిచారు. అయితే లాక్ డౌన్ నిబంధనల ప్రకారం మాస్క్, భౌతిక దూరంతో మే 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.మే నెలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అక్కడక్కడా నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు నమోదయ్యాయి. ఆ తర్వాత జూన్ 1 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చునని ఉత్తర్వులు జారీ అయ్యాయి.జూలై 2న ఆబ్కారీ శాఖ మరోసారి ఉత్తర్వులను జారీ చేసి రాష్ట్రంలో రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది.
