స్టాక్ మార్కెట్‌ ర్యాలీ…సెన్సెక్స్ 400 పాయింట్లు పైకి

Business

వరుసగా మూడో రోజు కూడా దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ, మెటల్ షేర్ల దన్నుతో మార్కెట్‌ భారీ లాభాల్లో క్లోజయ్యింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య డీల్ కుదరొచ్చనే అంచనాలు సహా యూకే ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయం వంటి అంశాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో 41,009 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 12,086 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ 41 వేల మార్క్ పైన క్లోజ్ కావడం గత రెండు వారాల్లో ఇదే తొలిసారి. నిఫ్టీ కూడా మళ్లీ 12 వేల మార్క్ పైకి చేరింది. నిఫ్టీ 50లో యాక్సిస్ బ్యాంక్, వేదాంత, హిందాల్కో, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ 4 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ 3 శాతం పడిపోయింది.

నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 4 శాతానికి పైగా పరుగులు పెట్టింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *