వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్లోనే ఉంచాలని రాష్ట్రానికి చెందిన ఎంపిలు డిమాండ్ చేశారు. వాల్తేరు డివిజన్ లేకుండా జోన్‌ను ఏర్పాటు చేసినా ఫలితం ఉండదని, అసలు వాల్తేరు లేని జోన్ తలలేని మొండెంలాగా ఉంటుందని అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని రైల్వే శాఖ ఇటిటిసి భవన్లో మంగళవారం విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, కర్నూలు, సికింద్రాబాద్ డివిజన్లలోని ఎంపిలతో దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపిలందరూ వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఇదే విషయమై 2014 నుండి డిమాండ్ చేస్తున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ ఎంపి కేశినేని సమావేశం నుండి బారుకాట్ చేశారు. వాల్ల్తేరు డివిజన్‌తో పాటు అమరావతికి నూతన రైల్వేలైన్ వేడయంతో పాటు, దానిని అన్ని ప్రధాన రైల్వే లైన్లకు అనుసంధానం చేయాలని ఎంపిలు ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. వైసిపి పార్లమెంటరీపక్ష నేత మిధున్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఎపిలో ఏర్పాటు చేయాలని కోరారు.. విజయవాడ డివిజన్‌ను మరింత విస్తరించడంతో పాటు కొత్త కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త లైన్ల సర్వే త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నత్తనడకన సాగుతున్న విషయాన్నిఆయన ప్రస్తావించారు. కాకినాడ ఎంపి వంగా గీత మాట్లాడుతూ సచివాలయంలో పనిచేసే వారికి సౌకర్యంగా అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి రైళ్లు వేయాలని కోరారు. సూదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఇక్కడ నుంచి బయలుదేరే విదంగా చూడాలని కోరారు. చిత్తూరు ఎంపి రెడ్డప్ప మాట్లాడుతూ రైల్వే బోర్డును దక్షిణ భారత దేశంలో ఏర్పాటు చేయాలన్నారు. హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా కరువుపీడిత జిల్లా కావడంతో రైల్వే అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జనరల్ మేనేజరు ను కలిసి రామవరప్పాడు, గుణదల, మధురానగర్ ప్రాంతాల్లో రైల్వే లైన్ల పారిశుద్ధ్యం మెరుగపరచాలని, రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశానికి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌదరి, టిజె వెంకటేశ్‌లు హాజరుకాలేదు.
నీతి ఆయోగ్ పరిశీలనలో విజయవాడ- అమరావతి రైల్వే లైన్
విజయవాడ – అమరావతి నూతన రైల్వే లైన్ ఏర్పాటు అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని, 2023 నాటికి కడప – బెంగుళూరు రైల్వే లైన్ పూర్తయ్యే విదంగా చర్యలు తీసుకుంటామని దక్షణి మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్య తెలిపారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గూడూరు, గుంతకల్లు, విజయవాడ డబ్లింగ్ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. కోర్టు తీర్పు అనంతరం నడికుడి- శ్రీకాళహస్తి లైన్ ఐదు నెలల్లో 45 కిలో మీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు. రైల్వే లైన్లకు సంబందించి భూ సేకరణ అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్ నుంచి మినహాయించిన విషయం తన పరిధిలోకి రాదని, ఎంపిలు సూచించిన విదంగా ప్రజల ఆకాంక్షను కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.